గ్రూప్స్ అభ్యర్థులకు 'న్యాయ'పరీక్ష!
నిన్న గ్రూప్-1, నేడు గ్రూప్-2 రేపు జేఎల్
అభ్యర్థులతో ఏపీపీఎస్సీ బంతాట
అడుగడుగునా ఎడతెగని వివాదాలు
హైదరాబాద్, ఏప్రిల్ 6 : గ్రూప్-1 అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఈ మూడు మెట్లు దాటితే చాలనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఇవీ మీరు ఎక్కాల్సిన అసలు సిసలు మూడు మెట్లు. గ్రూప్-2దీ అదే బాట. అడుగడుగునా నిర్లక్ష్యం.. ప్రతి నిర్ణయం వివాదాస్పదం.. విపరీతమైన తాత్సారం.. ఇదీ ఏపీపీఎస్సీకి సిసలైన నిర్వచనం. గ్రూప్-1, గ్రూప్-2, జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ వ్యవహారం సాగుతున్న తీరు, ఏపీపీఎస్సీ వైఖరి చూద్దాం. గ్రూప్-1 పయనం ఇలా ..
గ్రూప్-1 కేడర్‌లో 210 పోస్టుల భర్తీకి 2008లో నోటిఫికేషన్ ఇవ్వగా 2011 సెప్టెంబర్ 25- అక్టోబర్ 3 తేదీల మధ్య మెయిన్స్ నిర్వహించారు. ప్రశ్నపత్రాల్లో తెలుగు మీడియంలో అనువాద దోషాలొచ్చాయి. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కొందరు అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇంటర్వ్యూలు ఆపాలని ట్రిబ్యునల్ ఆదేశించినా హైకోర్టు అనుమతి పొంది ఇంటర్వ్యూలు ముగించేసి పోస్టులకు ఎంపికైన 206 మంది పేర్లతో తుది జాబితాను ప్రకటించి అంతా అయిపోయిందని ఏపీపీఎస్సీ చేతులు దులుపుకొంది.
అలా ఎంపికైన అభ్యర్థుల్ని తానే 'మూడో పార్టీ'ని చేసి పిటిషనర్లపైకి ఉసిగొల్పింది. ఇంటర్వ్యూలో ఇంటిముఖం పట్టిన మిగతా 211 మంది పిటిషన ర్లతో జత కలిసి మద్దతు ప్రకటించారు. పోస్టులకు ఎంపికైన 206 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషనర్లు ఇప్పటికే రూ. 1.5 లక్షలతో పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో లక్ష రూపాయల్ని ఇంటర్వ్యూల్లో ఎంపికకాని 211 మంది అభ్యర్థులు భరించినట్లు తెలుస్తోంది.
ప్రశ్నపత్రాల్లో తప్పు తేలితే పరీక్ష మొత్తం రద్దవుతుందని హైకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. అనువాద దోషాలు నిజమేనని ఏపీపీఎస్సీ కూడా కౌంటర్ అఫిడవిట్‌లో అంగీకరించిన నేపథ్యంలో ట్రిబ్యునల్ వెలువరించబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యతిరేకంగా తీర్పు వచ్చిన వర్గం పైకోర్టుకు వెళ్లడానికి సిద్ధమైంది. వివాదం చివరికి సుప్రీం దిశగా కదులుతోంది. ఇ ది పరిష్కారం కానిదే అభ్యర్థులకు నియామక పత్రాలందవు.
గ్రూప్-2 రూటు ఇదీ
2008 గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించి 2011 అక్టోబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు జరగ్గా 1020 పోస్టులకు గత నెల 30న ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్ష ముగిసి ఐదు నెలలు దాటినా 'కీ' విడుదల చేయలేదు. గ్రూప్-2 మూడు పేపర్లలో అనువాద దోషాలు, పొంతనలేని జవాబులున్న ప్రశ్నలు దాదాపు 10 ఉన్నాయి. పది మార్కులంటే చాలా కీలకం. వీటికి మార్కులు కలిపారో లేదో తెలియక.. అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
ఇక.. వైట్‌నర్ ఉత్పాతాన్ని ఊహించడంలో కమిషన్ విఫలమైంది. వైట్‌నర్ వాడినవారిని అనర్హులుగా ప్రకటించాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వైట్‌నర్‌ను గుర్తించే సాఫ్ట్‌వేర్ తమవద్ద లేదని, ఈసారికి వదిలేయాలని కోర్టులో కమిషన్ ప్రాధేయపడి.. నవ్వులపాలైంది. మరిక ఈ కేసు ఎప్పటికి తేలేనో! గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడిన 2008 డిసెంబర్ 31 నాటికి ఖాళీగా ఉన్న మరో 477 ఎగ్జిక్యూటివ్, 111 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని కూడా ఇందులోనే కలిపి భర్తీ చేయాలని కొందరు వేసిన పిటిషన్‌పై తీర్పును ట్రిబ్యునల్ వాయిదా వేసింది.
తీర్పు ఈ నెలలో ఎప్పుడైనా రావచ్చు. భర్తీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఏపీపీఎస్సీ అందుకు సిద్ధపడక తప్పదు. ఒక వేళ ట్రిబ్యునల్ తీర్పు అభ్యర్థులకు వ్యతిరేకంగా వస్తే తాజాగా ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థులను మళ్లీ పిలిపించి పోస్టు ప్రిఫరెన్స్ జాబితాలు తీసుకోవాలి. అలా చూసినా జాప్యం తప్పదు.
జేఎల్ .. రేపటి తలనొప్పి !
జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదలకానున్నాయి. జేఎల్ జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలకు గాను 30 ప్రశ్నల్ని తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఇంగ్లీషులోనే ఇచ్చేశారు. మరో 35 ప్రశ్నల్ని సగం తెలుగు, సగం ఇంగ్లీషులో ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు కమిషన్‌కు వినతులు పంపగా.. ఓ కమిటీ వేశామని, అందరికీ న్యాయం చేస్తామని చెప్పింది. కమిషన్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. అభ్యర్థులు మాత్రం పరీక్ష ఫలితాలు చూసి కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారు.
కమిషన్‌ను నమ్మని కోర్టులు
గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2 పరీక్షల విషయంలో ఏపీపీఎస్సీ వైఖరిని, చెబుతున్న మాటల్ని న్యాయస్థానాలు విశ్వసించట్లేదు. గ్రూప్-1లో 150 మంది పిటిషనర్ల సమాధాన పత్రాలను తమకు సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. వాటిని తామే పరిశీలిస్తామని, మూల్యాంకన మార్గదర్శకాలను పాటించారో లేదో తామే «ద్రువీకరిస్తామని ట్రిబ్యునల్ పేర్కొంది. ఇప్పుడు గ్రూప్-2లోనూ ఇంటర్వ్యూలకు ఎంపికైన 1200 మంది సమాధానపత్రాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించడం చర్చనీయాంశమైంది.
ANDHRA JYOTHI. 07.04.2012