Thursday, April 12, 2012

GROUP I EXAM CANCELLATION ISSUE IN COURT

గ్రూప్-1 పరీక్ష రద్దే!
ఇదే అంతిమ పరిష్కారం
ట్రిబ్యునల్ ఎదుట అభ్యర్థుల వాదనలు

హైదరాబాద్, ఏప్రిల్ 11: గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి, తిరిగి పకడ్బందీగా నిర్వహించడమే అంతిమ పరిష్కారమని తెలుగుమీడియం అభ్యర్థుల తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. "ప్రశ్నాపత్రాల్లోనే కాదు.. ప్రతీ దశలోనూ అనేక లోపాలున్నాయి. 750 మార్కుల పేపర్లలో 40శాతం తప్పులే. తప్పులు దొర్లిన మాట నిజమేనని ఏపీపీఎస్సీ ఇప్పటికే అంగీకరించింది. మరి ఇంకా విచారణ (వాదనల)ను కొనసాగించాలనుకోవడం ఎందుకు? రద్దు చేసి, మళ్లీ నిర్వహిస్తే.. నిరుపేద అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది'' అని వారు విజ్ఞప్తి చేశారు.

గ్రూప్- 1 కేసును విచారిస్తున్న బెంచ్ ఎదుట బుధవారం అభ్యర్థుల న్యాయవాదులు ఎం.ప్రకాష్‌రెడ్డి, ఎం.రాంగోపాల్, కే.నారాయణ, రత్నారెడ్డి వాదనలు వినిపించారు. "ఏదైనా పరీక్ష నిర్వహించి, ఫలితాలు వెల్లడించాక ఆ ప్రక్రియలో రహస్యాలు ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్' కేసులో స్పష్టం చేసింది. మరి ఏపీపీఎస్సీ మాత్రం తప్పుల తడకగా పరీక్ష నిర్వహించింది. పైగా మూల్యాంకన విధానం, అందుకు ఇచ్చిన గైడ్‌లైన్స్ ఏమిటి? అనేవి చెప్పమంటే.. రహస్యం(కాన్ఫిడెన్షియల్) అంటోంది. ఇదేం తీరు?'' అని వారు ప్రశ్నించారు.

గ్రూప్-1 మెయిన్స్ 5 పేపర్లలో ఇప్పటి వరకు లేవనెత్తిన తప్పులతో పాటు.. కొన్ని కొత్త తప్పుల్ని కూడా వారు బెంచ్ దృష్టికి తెచ్చారు. "ఇంగ్లీషు, తెలుగు పేపర్ల మూల్యాంకనం కోసం చేత్తో రాసిన మార్గదర్శకాల నోట్ ఇచ్చారు. అధికారికంగా ఇచ్చే నోట్‌ను ఎక్కడైనా చేతిరాతతో ఇస్తారా? అది కూడా ఏ అధికారి సంతకం లేకుండా! పేపర్ -5 ప్రశ్న 15(ఏ) అర్థం కాలేదని, అందుకే మార్కులు తక్కువ వచ్చాయని సెలెక్టయిన అభ్యర్థులే ఫిర్యాదు చేశారు. చాలా ప్రశ్నలు అసలు అర్థం కాని తెలుగు మీడియం వాళ్ల పరిస్థితి ఏమిటి?'' అని పేర్కొన్నారు.

"ప్రశ్నపత్రంలో.. 'ప్రతి సంవత్సరం మారుతున్న సాంకేతికత వల్ల.. మానవ సంబంధాలు తగ్గుముఖం పడుతున్నాయి' అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది ప్రశ్నా? లేక దానిపై అభిప్రాయం చెప్పాలా? విశ్లేషించాలా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు'' అని అన్నారు. అభ్యర్థుల పరిస్థితిని అర్థం చేసుకుని పరీక్ష మళ్లీ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను కోరారు. ఈ వాదనల అనంతరం జస్టిస్ యతిరాజులు స్పందించారు.

"పేపర్లు ఎలా దిద్దారనేది తెలియాలని అభ్యర్థులు అడుగుతున్నారు. మీరేమో ఎగ్జామినర్స్‌కు మార్గదర్శకాలు ఇచ్చామంటున్నారు. కొన్ని మాకు అందజేశారు. మరి వాటిలో ఏది రహస్యం? ఏది కాదు? ట్రిబ్యునల్‌కు ఇచ్చిన వివరాలు అభ్యర్థులకు ఇవ్వొచ్చు కదా!'' అని పేర్కొన్నారు. అనంతరం నాన్ జ్యుడీషియల్ సభ్యుడు ఏకే గోయల్ కల్పించుకుంటూ.. "గందరగోళానికి గురిచేసిన ప్రశ్నలకు అభ్యర్థులు ఎలా జవాబులు రాశారో తెలుసుకునేందుకు మార్కుల పట్టిక ఇమ్మన్నాం.

దానికి మీరెందుకు అంత ఆవేదన చెందుతున్నారు. ఏపీపీఎస్సీ ప్రభుత్వ సంస్థ, అలాంటపుడు పరీక్ష నిర్వహణ ప్రక్రియలో రహస్యాలెందుకు? మార్కులను పట్టిక రూపంలో ఇవ్వండి'' అని ఆదేశించారు. దాంతో ఆ మార్కులను అందజేస్తామని ఏపీపీఎస్సీ అదనపు అడ్వొకేట్ జనరల్ కృష్ణమూర్తి చెప్పారు.

Andhra Jyothi.12.04.2012

No comments:

Post a Comment